సంస్కృతమంటే భయమెవరికి?

కొత్త వేదాన్ని వ్రాసే స్థాయికి నొబిలి మహాశయుడు వెళ్ళినపుడు మనమెందుకు ఈ భాషను తెలుసుకోలేం? ఈ ప్రశ్నపై ఆలోచించాలి.

గత సంవత్సరం జూన్ మాసంలో అమెరికాలోని ప్రిన్స్ టన్  విశ్వవిద్యాలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. మా అబ్బాయికి పి.హెచ్.డి. డిగ్రీ ఇచ్చే సమయం కాబట్టి కుటుంబసహితంగా వెళ్ళాం. విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులైన ప్రెసిడెంటు మరియు డీన్‌లు లాటిన్ భాషలో వాళ్ళ ప్రసంగాలు ప్రారంభించి తర్వాత ఆంగ్లభాషలో మాట్లాడారు. డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లాటిన్ భాషలోనే ఉన్నాయి. అదేమిటని విచారిస్తే కేవలం అక్కడే కాకుండా అమెరికాలోని టాప్ యూనివర్శిటీలలో అది పరిపాటి అని తెలిసింది. అమెరికా దేశానికి కేవలం అయిదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అయినా తమకు గొప్ప చరిత్ర ఉంది అని చెప్పుకోవడానికీ, ఆ దేశ యువత తమ మూలాలు ఆ భాషలో ఉన్నాయని గర్వంగా  చెప్పుకోవడానికి ఆవిధంగా లాటిన్ భాషను తమ భాషగా చెప్పుకుంటున్నారు.

అమెరికాకూ, రోమ్‌కూ మతం తప్ప మిగతా ఏ సంబంధమూ లేదు. వారి మతగ్రంథాలు లాటిన్ భాషలో ఉండడమొక్కటే వారికి సంబంధం. సంస్కృతం అలా కాదు. సంస్కృతమంటే కేవలం హిందూమతం కాదు. ఇంగ్లీషు అంటే క్రైస్తవమతం ఎలా కాదో అలాగే సంస్కృతమంటే హిందూమతం అని అర్థం కాదు. వేదాల్నీ, దేవుడినీ అంగీకరించని బౌద్ధులు, జైనులు, అలాగే పూర్తిగా నాస్తికులైన చార్వాకులు మొదలైన వాళ్ళందరూ సంస్కృతంలోనే రచనలు చేశారు. మొదట్లో బౌద్ధులు పాళీభాషలో పుస్తకాలు వ్రాశారు. అయితే అవి ఒక చిన్న ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఈనాడు ఇంగ్లీషులో వ్రాస్తే ప్రపంచమంతా ఎలా చదవగలరో అలాగే ఆనాడు వారందరూ పాళీ భాష వదిలి సంస్కృతంలో వ్రాయడం మొదలుపెట్టారు. లాజిక్, తత్త్వశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, దండనీతిశాస్త్రం, ధర్మశాస్త్రాలు, ఆయుర్వేదం లాంటి విషయాలపై రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒక వర్గంవారే దీన్ని నేర్చుకున్నారనడం బొత్తిగా అవగాహన లేని వాదన. ప్రపంచంలోనే మొట్టమొదటి నిఘంటువు శ్లోకాల రూపంలో వ్రాసిన అమరసింహుడు జైనుడు. పాణిని వ్యాకరణానికి వ్యాఖ్యలు వ్రాసినవారు బౌద్ధులు, జైనులు. అనేకమంది రాజులు కావ్యాలు, నాటకాలు వ్రాశారు. క్రమక్రమంగా సంస్కృతం భరతఖండం మొత్తానికి link language గా బ్రిటిష్ వారు వచ్చేవరకూ కూడా కొనసాగింది.

మన ప్రాచీన గ్రంథాల్ని చాలవాటిని వెలికితీసిన ఘనత బ్రిటీష్ వారికి ఇవ్వాలి. వారి పాలనలో బౌద్ధ గ్రంథాలనేకం ఆఫ్గనిస్తాన్‌లో లభించాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం సమగ్రప్రతి కేరళలో లభించింది. దేశంలో విద్యార్థులు ఒక మూల నుండి మరొక మూలకు వెళ్ళి చదువుకున్నారు.సంస్కృతం జాతి మొత్తానికి చెందిన భాష. కేరళ నుండి గాంధార దేశం (ఆఫ్గనిస్తాన్) వరకూ వ్యాపించిన భాష. స్వతంత్రం వచ్చిన సమయంలో పార్లమెంటులో జాతీయభాష ఏది ఉండాలి అనే ప్రశ్నపై అంబేద్కర్ కూడా సంస్కృతాన్ని సమర్థించడం మనం గమనించాలి.

“ఈ దేశం సంస్కృతిని పెకలించే ఉద్దేశంతో పనిచేస్తున్న మన మిషనరీలందరూ సంస్కృతాన్ని బాగా చదవాలి, ఆ భాషలోని, శాస్త్రాల్లోని మెళకువల్ని గమనించి మన కార్యకలాపాలు చేయాలి. సంస్కృతం అనే ఆయుధంతో పాటు లాజిక్ కూడా చదవాలి ఇక్కడ పండితులు, తెలివైనవాళ్ళు. ఇది చాల కష్టమైన పని అయినా ఇష్టంగా చేయాలి” (పేజీ 48-49) అని ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు మోనియర్ విలియమ్స్ “A Study of Sanskrit in Relation to Missionary Work in India” అనే ప్రసంగంలో 1861లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చెప్పాడు. ఈ ప్రసంగం ప్రారంభంలో ఆయన మాటలు గమనించదగ్గవి. “(India) attained a high degree of civilization when our forefathers were barbarians, and had a polished language and literature when English was unknown.” ఈ ప్రసంగం మొత్తం పుస్తక రూపంలో ఇంటర్‌నెట్‌లో మనం చూడవచ్చు. మ్యాక్స్ ముల్లర్ లాంటి పండితులందరూ భారతీయ సంస్కృతిని నిర్మూలించాలనే ధోరణితో సంస్కృతాన్ని చదివారు. అంతవరకూ ముద్రించని వేదాల్లాంటి గ్రంథాల్ని ముద్రించడం, వాటిపైన ఇంగ్లీషులో వ్యాఖ్యలు వ్రాయడంతో భారతదేశంలోని విద్యావంతులందరూ వాటినే ప్రమాణగ్రంథాలుగా, primary sources గా భావించే వాతావరణం ఏర్పడింది.

మోనియర్ విలియమ్స్ చెప్పినదే అతనికి ముందు వచ్చినవారూ, తర్వాతవారూ కూడా ఆచరించారు. రాబర్ట్ నొబిలి అనే ప్రచారకుడు జందెం వేసుకొని రోమన్ బ్రాహ్మణుడు అని పరిచయం చేసుకుని అయిదవ వేదం అంటూ ఒక వేదాన్నే సృష్టించాడు. ఆయన మతానికి అనుకూలంగా ఉన్న గ్రంథమిది. సాక్షాత్తూ నేడు మనం ఇంటర్‌నెట్‌లో ఈశావాస్య ఉపనిషత్ కోసం చూస్తే ఒకానొక తమిళ పండితుడు వ్రాసిన వ్యాఖ్య కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తులో ‘ఈశ’ అంటే ‘జీసెస్’ అని చెప్పి ఒక పి.హెచ్.డి.కూడా తీసుకున్నాడు. సన్మానాలు కూడా పొందాడు. యూట్యూబ్‌లో UIRC అనే వెబ్ సైట్ చూస్తే కొందరు ముస్లిం సోదరులు కూడా ఉపనిషత్తుల్లోని మంత్రాలు చెబుతూ మీ పుస్తకాల్లో ఉన్నది మా దేవుడే అని ప్రచారం చేయడం చూడగలం. ఇదంతా మనం చిన్నప్పుడు చదివిన బ్రాహ్మణుడు-మేకపిల్ల కథకు చక్కని ఉదాహరణ. కుక్క అనే భ్రమతో బ్రాహ్మణుడు మేకపిల్లను పారవేసినట్లే మనం ఈనాడు మన సంస్కృతిని పారవేస్తున్నాం.

ప్రభుత్వం సంస్కృతాన్ని స్కూళ్ళలో ప్రవేశపెడితే హిందూత్వం పెరిగిపోతుందని కొందరి ఆందోళన. సంస్కృతం నేర్చుకోవడం వల్లనే హిందూత్వాన్ని పెకలించి వేయగలమని మరికొందరి వాదన. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఈ రెండోవర్గం వారు పట్టుదలగా సంస్కృతం నేర్చుకుంటూనే ఉన్నారు. మూడవ వర్గం, అంటే హిందూత్వం గురించి మాట్లాడేవాళ్ళు గొప్పగా సంస్కృతం నేర్చుకున్న దాఖలాలు లేవు. అసలైన సంస్కృత పండితులకి ఈ గొడవంతా అసలే తెలియదు. ఎవరు ఎలాంటి రచనలు చేస్తున్నారో అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వీరికి బొత్తిగా తెలియదు. అన్ని విమర్శలకూ సమాధానం చెప్పగలిగే అనర్గళమైన పాండిత్యం మాత్రం వీరి దగ్గర ఉంది. వివేకానందుడు చెప్పినట్లు వీళ్ళందరూ బంగారు నిధిపై కూర్చుని పేద బ్రతుకులు గడుపుతున్నవారు.

సత్యమేవ జయతే –ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అనేది మన సిద్ధాంతం. అయితే సత్యమేమిటో మనమే తెలుసుకోవాలంటే ఇతరులు ఎవరో చెప్పిన మాటలు కాకుండా మనమే దాన్ని పరిశీలించాలి. మనల్ని పాలించడానికి వచ్చినవాళ్ళు, వాళ్ళ సంస్కృతిని మనపై రుద్దాలని వచ్చినవాళ్ళూ మనల్ని గురించి నిజాలు వ్రాస్తారని భావించడం మన అమాయికత. అందమైన ఆంగ్లభాషలో అసత్యాలు చెపితే అవి నిజం కావు. మన పుస్తకాల్లో ఎలాంటివి నెగిటివ్ గా చెప్పగలరో అవన్నీ ఇతరులు చెప్పేసారు. ఆ ప్రచారం అలాగే ఉండాలి, మంచి విషయాలు బయటకు రాకూడదు అనుకునేవాళ్ళు సంస్కృతాన్ని వ్యతిరేకిస్తారు. మీ పుస్తకాల్లో ఏముందో మేము అందంగా చెప్పేశాం. అందమైన పుస్తకాల్లో అందించాం. మీరు మీ మూలగ్రంథాల్ని చదవాల్సిన పనిలేదు అనేవాళ్ళు వ్యతిరేకిస్తారు.

ప్రభుత్వం సంస్కృతాన్ని నిర్బంధంగా ప్రవేశపెట్టాలి ఎవరో చదవాలి, నాకు మాత్రం టైమ్ లేదు అనడం పలాయనవాదం.. మన సంస్కృతిలో ఋషి ఋణం అనే భావన ఒకటి ఉంది. మన ప్రాచీనులు మనకు చెప్పిన విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడం, ఆ సంస్కృతిని నిలపడంమన కర్తవ్యం అనేది ఈ పదం యొక్క అర్థం. ఆధునిక ప్రపంచంలోని ప్రచార ధోరణుల నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా సత్యమేమిటో తెలుసుకోవాల్సిన కర్తవ్యం చదువుకున్న మనందరిదీ. కొత్త వేదాన్ని వ్రాసే స్థాయికి నొబిలి మహాశయుడు వెళ్ళినపుడు మనమెందుకు ఈ భాషను తెలుసుకోలేం? ఈ ప్రశ్నపై ఆలోచించాలి.

This article was first published in Andhra Jyoti,a Telugu daily and has been republished with permission.

Disclaimer: The facts and opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.
The author is the former DGP of Andhra Pradesh and is a practitioner and teacher of Vedanta.
 • Venkata Subba Rao Bollapragada

  ఇక్కడ జరుగుతున్నది భాషాప్రస్తావన; మతప్రసక్తి తీసుకొనివచ్చినది తమరే. భాష నెర్చుకొనెవారి దందరిదీ. సంస్కృతము కొందరే మాటలాడాలని, ఇతరులు మాటలాడకూడదనీ అభ్యంతరాలు తెలిపి, అణ్దరికీ చేరకుండా చేసినవారలలో బ్రాహ్మణులుకూడా ఉన్నారు. ఆవిధముగా సంస్కృతము ప్రాచుర్యాన్ని కోల్పోవుచున్నది. అలా కొందరికే పరిమితము చేయడమువలన సంస్కృతాన్ని ఇప్పుడు పరిరక్షించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సంస్కృతాన్ని వైదికభాషగా తమరు అన్నారని నేనెప్పుడూ అనలేదు. అది మీరే ఊహించుకున్నారు. సామాన్యజనులలో సంస్కృతముపట్ల అపోహలను తొలగించడానికే ఆ వ్యాఖ్య చేసేను; సరియైనదే.
  నా స్వంత అనుభవము కూడా చెప్పుతున్నాను. గ్రీటింగ్ కార్డులుగా కొన్ని సంస్కృత శ్లోకాలని నేను నా మిత్రులకు లోగడ పంపి యున్నాను. వాటిని తపాలాకార్యాలయమునుండి అపహరించిన వారిలో కొందరు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. కొన్ని విదేశీ సంస్థలు ముద్రించిన ఆంగ్ల శుభాకాంక్షాపత్రాలను నాకు అంటగట్టడానికి గట్టి ప్రయత్నములు చేసిరి. బాగుగా పరిశీలించిన పిమ్మటే నా అభిప్రాయాలను వెల్లడీంచాను.
  సంస్కృతముపట్ల మీరు కనబరచిన ఉత్సాహము నన్నెంతో సంతోషపెట్టినది. మనమందరము సంస్కృతభాషని రక్షించి ప్రాచుర్యము చేద్దాము. సంస్కృతభాషాపరిరక్షకేభ్యో ప్రోత్సాహం లప్సీష్ట !

 • Venkata Subba Rao Bollapragada

  ఏ భాషా ఎవరినీ భయపెట్టదు. సంస్కృతభాషవలన మనమన మాతృభాషలు అన్నీ తత్సమతద్భవ పదజాలములతో సమున్నతమైనవి. సంస్కృతభాషాజ్ఞానమువలన ఇతర భారతీయ, విదేశీయ భాషల వ్యాకరణములు కూడా తేటతెల్లమగును. సంస్కృతమంటే అదేదో ’మంత్రాలభాష’, ’బ్రాహ్మణులభాష’, ’హైందవభాష’ అనే అపప్రథలు సమాజములో మెండుగా ఉన్నాయి. దీనికి కొంతవరకు బ్రాహ్మణులు, హైందవులే కారణము. వైదికసాహిత్యమేకాక, సంస్కృతములో పద్యగద్యనాటక రచనలు ఎన్నో కలవు. జయదేవుని అష్టపదులు, మహాకవి కాళిదాసుని కావ్యములు, నాటికలు చదివితే సంస్కృతము మన మాతృభాషలకు (తెలుగు, కన్నడ, హిందీ, వంగ మొదలగునవి) ఎంతదగ్గరగా ఉంటుందో తెలుస్తుంది

  • Raja Kishor D

   “బ్రాహ్మణులు, హైందవులే కారణం ..” అంటూ హిందువులను వేరు చేస్తూ పేర్కొనడం మీ అవగాహనా రాహిత్యాన్ని తెలుపుతోంది. ఈ దేశంలో ఉన్నవారంతా హిందువులే. భారత ధర్మము అన్నా, హిందూ ధర్మము అన్నా, సనాతన ధర్మము అన్నా ఒకటే.

   • Venkata Subba Rao Bollapragada

    ప్రక్కదారి పట్టించకండి విషయాన్ని. సాధారణ ప్రజలలో సంస్కృతభాషపట్ల ఉన్న ఆభిప్రాయాలను, అపోహలను బాగుగా పరిశీలించినపిమ్మట ఆ వ్యాఖ్య చేసేను. సబబైనదే. విషయము సంస్కృతభాష గురించి; ఏ మతం గురించీ కాదు (చదవండీ సరిగా నా వ్యాఖ్యని). సంస్కృత వ్యాకరణము కూడా రెండు రకాలు. ౧. ఐదికానికి సంబందించినది-ప్రాతిశాఖ్యములు; ౨. మామూలు భాషకు సంబందించినది-పాణీణి వ్యాకరణము మొదలగునవి. ’సంస్కృతము కేవలము వైదికభాషే’ అనుకొనుచున్న తమరి మాటలలోనే పరమ అజ్ఞానము గోచరించుచున్నది. అంతేకాదు; సంస్కృతం కెవలం భారతీయుల భాషే కాదు; ప్రపంచములో పలు భాషలకు మాతృక.

    2017-06-06 12:31 GMT+05:30 Disqus :

    • Raja Kishor D

     ఇక్కడెవరూ పక్కదారి పట్టించడంలేదు. భారతదేశంలో ఉన్నవారందరూ హిందువులే. మీరు ఏ కొద్దిమందో హిందువులు అన్నట్లు వ్రాయడం సరికాదు.

     ఇక సంస్కృతాన్ని భారతదేశానికే పరిమితం చేసి విశ్వవ్యాప్తం కాకుండా హిందువులు అడ్డుకున్నారనడంలో వాస్తవం లేదు. అలా అయితే మన సంస్కృతి విశ్వవ్యాప్తం ఎలా అవుతుంది?

    • Raja Kishor D

     “సంస్కృతము కేవలము వైదికభాషే” అని నేనెక్కడ అన్నాను? అంటే మీకు మీరే ఏదో ఊహించేసుకుని తోచింది అనేస్తున్నారన్నమాట. ముందు మీ అజ్ఞానం చూసుకోండి. అనవసరంగా లేనిపోనివి ఎదుటివారిపై మోపకండి.

 • dhee

  Very nicely written!!

 • smashan tara

  true arye, but ground action is zero. persons like you should create institutional setup to bring awareness and move forward with good strategies to awake our people. we need to build strong institutions which should create platform for all virats then we can fight and win neo kurukshetra