సమాజంలో ఒకవైపు భక్తి విపరీతంగా పెరుగుతున్నా మరొకవైపు అశాంతి, అన్యాయం పెరుగుతున్నాయని చాలమంది బాధపడడం చూస్తూంటాం. దైవభక్తి కొంతవరకూ మనిషిని మంచిమార్గంలో పెడుతుందనీ, చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచుతుందనీ మన విశ్వాసం. అయినా పై విధమైన పరిస్థితికి కారణమేమిటి?
భాగవతం యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఒక కథ ఉంది. నారదుడు ఒకసారి భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక యౌవనంలో ఉన్న స్త్రీ, ఆమెతో పాటే ఇద్దరు వృద్ధులు కనిపిస్తారు. ఆమె చాల దుఃఖిస్తూ ఉండగా అక్కడ గుమికూడి ఉన్నవారు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూంటారు. నారదుడు ఆమె దుఃఖానికి కారణమేమిటని అడిగాడట. ఆమె తన పేరు భక్తి అనీ, ఆ ఇద్దరు వృద్ధులూ తన పుత్రులనీ, వారి పేర్లు జ్ఞానము, వైరాగ్యమనీ చెబుతుంది. లోకంలో మనుషుల కోరికల కారణంగా భక్తికి ఎక్కువ ఆదరణ ఉంది కాని జ్ఞానాన్నీ, వైరాగ్యాన్నీ పట్టించుకునేవారు లేనందువల్ల భక్తి మాత్రం యౌవనంలో ఉంది. ఆమె కొడుకులిద్దరూ వృద్ధులయ్యారు. ఇది కలికాల ప్రభావం అని ఆమె చెబుతుంది. ఈ సమస్యకు పరిష్కారమేమిటి అని నారదుడు ఆలోచిస్తూ ఉండగా సనత్కుమారుడు ఆయనకు ఒక సూచన చేశాడట. భాగవతంలో వేదవ్యాసుడు భక్తినీ, జ్ఞానాన్నీ కొత్తశైలిలో అందించాడు. ఉపనిషత్తుల సారాన్నంతా అనేక భగవద్భక్తుల కథల రూపంలో అందించాడు. దాన్ని వింటే ఆ వృద్ధులకు మేలు కలుగుతుంది అన్నాడట. అది విని ఆ ముగ్గురూ భాగవతం ప్రవచనం జరుగుచున్న స్థలానికి వెళ్ళారు. ఆ ప్రవచనం విన్న తర్వాత ఆ వృద్ధులు కూడా యౌవనాన్ని పొందారట.
ఈ కథలోని సందేశం సులభంగానే తెలుస్తోంది. దైవభక్తి మనిషికి వైరాగ్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత భగవంతుని స్వరూపమేమిటి అని విచారించే తెలివినీ, జ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్లే భక్తిని తల్లి అన్నారు. మిగతా రెండింటినీ కొడుకులతో పోల్చారు. ఈ మూడింటికీ సమాన ఆదరణ ఉండడం అవసరం. భక్తిని మాత్రమే పట్టుకొని మిగతా రెండింటినీ వదిలేస్తే వాటికి హాని కలుగుతుంది. మనిషికి కేవలం కోరికలపైనే ధ్యాస ఉన్నపుడు కోరికలు తీర్చేవ్యక్తిగా భగవంతుణ్ణి వాడుకుంటాడే గాని భగవంతుని స్వరూపమేమిటి అని విచారించే సంస్కారం ఉండదు.
నాలుగు రకాల వ్యక్తులు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మొదటిది కష్టాల్లో ఉన్నవాడు, రెండవది కష్టం లేకపోయినా కోరికలున్నవాడు. మూడవది జిజ్ఞాసువు, అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు. నాల్గవది జ్ఞాని. పురాణాల్లోని ఉదాహరణలు చూస్తే కుంతీదేవి, ద్రౌపది మొదటి రకానికి చెందినవారట. ఎంతో ఆర్తితో కృష్ణుణ్ణి ప్రార్థించారు. భాగవతంలో ధృవుడు రెండవ కోవకు చెందినవాడు. భగవంతుడి దర్శనమైన తర్వాత కూడా అతడు వ్యక్తిగత అభ్యుదయాన్ని కోరుతాడు. శాశ్వతమైన ఉన్నతస్థానాన్ని కోరుకుంటాడు. మూడవ కోవకు చెందినవ్యక్తి భాగవతంలోని కృష్ణుడి మిత్రుడైన ఉద్ధవుడు మొదలైనవారు. నిజమైన శ్రద్ధ ఉన్నవారు. జ్ఞాని భక్తుడికి ఉదాహరణ ప్రహ్లాదుడు.
పురాణాల్లో నాల్గురకాల వ్యక్తుల్నీ చూశాం కాని ప్రస్తుత సమాజంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్ళనే ఎక్కువగా చూస్తాం. దైవభక్తి ఇవ్వాల్సిన సంస్కారం మనకి కలగలేదన్నమాట. దేవుణ్ణి కేవలం మన లౌకిక లావాదేవీల్లో వాటాదారుడిగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుడికి ముడుపులు చెల్లించి మళ్ళీ కొత్తపాపాలు చేయవచ్చని భావిస్తాం కానీ దేవుడు ఇలాంటివాటిలో వాటాదారుడిగా ఉండడని భగవద్గీత (5-15) చెబుతుంది. దేవుడు మన పాపాన్ని గానీ పుణ్యాన్ని గానీ తీసుకునే వ్యక్తి కాదని చెప్పడానికి ఎంతో సాహసం అవసరం. మతాలు మామూలుగా మా దేవుడు పాపాలన్నింటినీ తీసేసుకుంటాడని చెబుతాయి. అందుకు భిన్నంగా కృష్ణుడు “నాదత్తే కస్యచిత్ పాపం(5-15)” – దేవుడు ఎవరి పాపాలూ తీసుకోడు అంటాడు. ఒకవ్యక్తి తనుచేసే ప్రతిపనికీ బాధ్యుడుగా ఉండాలని మన సిద్ధాంతం. మరి దేవుడెందుకు అంటే అతడు కేవలం మంచి బుద్ధిని కలిగిస్తాడట. “దదామి బుద్ధియోగం తం (10-10)” అంటే – అతనికి మంచి బుద్ధిని కలగజేస్తాను అంటాడు. ఇదే భావాన్ని భారతంలో మరొకచోట వ్యాసుడిలా అంటాడు – “దేవతలు తాము రక్షించాల్సిన వ్యక్తిని పశువుల కాపరిలాగ కర్ర పట్టుకొని రక్షించరు, ఎవణ్ణి రక్షించాలని భావిస్తారో అతడికి మంచి బుద్ధిని ప్రసాదిస్తారు.”
దీన్నే భగవద్గీతలో భక్తియోగం అనే పేరిట ఒక పూర్తి అధ్యాయంలో చెప్పారు. భక్తి అనేది ఒక యోగమట. యోగం అంటే సాధనం. జ్ఞానానికి సాధనం. గీతలో ఒకానొక సందర్భంలో అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. కేవలం వేదాంతం తెలుసుకోవడం వల్ల మోక్షం కలుగుతుందా లేదా భక్తి వల్లనా అని. ఆ రెండూ సరైన మార్గాలే అని సమాధానం. ఒకరేమో చాలకష్టపడి మోక్షాన్ని పొందుతారు. మరొకర్ని నేనే స్వయంగా ఉద్ధరిస్తాను అంటాడు కృష్ణుడు. నిష్కామకర్మ, ధ్యానం మొదలైనవాటితో మనస్సులోని కోరికలు, రాగద్వేషాలు తగ్గించుకున్న తర్వాత వేదాంతాన్ని తెల్సుకోవడమనేది మొదటి మార్గం. ఇది చాల శ్రమతో కూడిన మార్గం. కోరికలు లేని దైవభక్తి రెండవమార్గం. మన పూర్వీకులు ఈ రెండు మార్గాలకూ రెండు ఉపమానాలు చెప్పారు. మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో వచ్చేవాడి ధోరణి ఇది. రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో వచ్చేవాడి స్థితి ఇది.
ఇది ఇలా ఉండగా మనం కేవలం కోరికలకే ఎందుకు పరిమితమవుతున్నాం, దేవుణ్ణి మన కోరికలు తీర్చుకునే సాధనంగా ఎందుకు భావిస్తున్నాం అంటే కొంతవరకూ మతపెద్దలు, ధర్మాన్ని బోధించేవాళ్ళు కూడా కారణమని చెప్పవచ్చు. కేవలం వ్రతాలు, పూజలు, యజ్ఞాలు మాత్రమే చేస్తూ ఇతరులతో కూడా వాటినే చేయిస్తూ విషయాన్ని బోధించక పోవడం వల్ల మనకు ధర్మం యొక్క సమగ్రస్వరూపం తెలిసే అవకాశం లేదు. ఈ సందర్భంలో వేదవ్యాసుడి ఉదాహరణే తీసుకోవచ్చు. వేదాల్ని విభజించి, యజ్ఞాలు మొదలైన వాటి వ్యవస్థ చేసిన తర్వాత కూడా ఆయనకు మనశ్శాంతి కలగలేదట. దానికి కారణమేమిటి అని విచారంలో ఉండగా భగవంతుడి తత్త్వాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించకపోవడమే కారణమని నారదుడు చెప్పడం, అతడు భాగవతాన్ని వ్రాయడం జరిగింది.
భక్తి యొక్క సమగ్ర స్వరూపాన్ని విశ్లేషించిన పుస్తకాలు మనకు చాల ఉన్నాయి. ఇందులో నారదభక్తి సూత్రాలు, శాండిల్య భక్తిసూత్రాలు అనేవి ముఖ్యమైనవి. భక్తిని అనేక కోణాల నుంచి పరిశీలించిన ఈ గ్రంథాలు ప్రపంచ భక్తి సాహిత్యంలోనే సాటిలేనివి.
This article was first published in Andhra Jyoti,a Telugu daily and has been republished with permission.
Disclaimer: The facts and opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.
The author is the former DGP of Andhra Pradesh and is a practitioner and teacher of Vedanta.