మనలో చాలమంది మన సంప్రదాయాన్ని, ఆచారాలనూ భక్తిశ్రద్ధలతో అనుసరిస్తూ ఉంటాం. దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం మొదలైనవి చేస్తూ రిలిజియస్ పర్సన్ అనే నిర్వచనంలోకి వస్తాం. కానీ మన సంప్రదాయాన్ని గూర్చి కొంతైనా తెలుసుకునే ప్రయత్నం అతి కొద్దిమందే చేస్తాం. ఇందుకు కారణం సమాజంలో వచ్చిన మార్పు, ఆధునిక జీవితంలో ఒత్తిళ్ళు, అంతకన్నా ముఖ్యంగా మన సంస్కృతి మూలాల్ని చెప్పేవాళ్ళు తక్కువగా ఉండడం.
చాలమంది పండితులు అనేక విషయాలపై ప్రవచనాలు చెప్తున్నారు కదాఅని మనకు సందేహం రావచ్చు. అనేక పురాణాల నుండి కథలు తెలుసుకుంటున్నాం. భారతం, భాగవతం మొదలైనవన్నీ వింటున్నాం. ఎన్నో ఆచార వ్యవహారాల గూర్చి తెలుసుకుంటున్నాం. కానీ మన పిల్లలు ‘మనకెందుకు చాలమంది దేవుళ్ళు’, ‘మనం విగ్రహాల్ని పూజిస్తామా’, ‘దేవుళ్ళూ, రాక్షసుల యుద్ధాలు ఏమిటి’ మొదలైన ప్రశ్నలు వేస్తే సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే పురాణాలు సరిపోవు. మన మూలగ్రంథాలు చదవాలి.
మనం పుస్తకాల షాపుకు వెళ్ళి చూస్తే వేదాలు, ఉపనిషత్తులు అనే అతిప్రాచీన పుస్తకాలతో పాటు విష్ణుపురాణం, శివపురాణం, అగ్నిపురాణం మొదలైన ఎన్నెన్నో పురాణాలు, భారతం – భాగవతం వంటి గ్రంథాలు, అలాగే మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి లాంటి పుస్తకాలు కనిపిస్తాయి. రోజూ పూజల్లో వాడుకునే సహస్రనామాలు, స్తోత్రాలు అనేకరకాలు కనిపిస్తాయి. ఇవన్నీ గొప్ప పుస్తకాలే. అయినా మనకు కావలసిన జవాబులు ఏ పుస్తకంలో ఉందో తెలియని పరిస్థితి. మన విమర్శకులు మనుస్మృతి, రామాయణం మొదలైన పుస్తకాల్ని సామాజిక కారణాల వల్ల విమర్శిస్తూ ఉంటారు. ఇవి మన సంస్కృతికి మూలగ్రంథాలా అంటే కావు అనే చెప్పాలి. వీటికి కూడా మూలమైనవి వేదాలు, వేదాల చివరి భాగాలైన ఉపనిషత్తులు అనే పుస్తకాలు. మన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉపనిషత్తుల్లోనే దొరుకుతాయి.
కొన్నివేల యేండ్ల క్రితం అనేకమంది ఋషులు వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో సత్యాన్వేషణలో ఉంటూ దర్శించిన విషయాలు ఈ ఉపనిషత్తులు. వీటన్నింటినీ చదవాలంటే భాషాజ్ఞానం మాత్రమే చాలదు, వాటి పూర్వాపరాలు తెలిసి వాటిని అన్వయించుకునే పరిజ్ఞానం ఉండాలి. ఇది చాలా కష్టమైన విషయం. అయినా ఈ ఉపనిషత్తుల సారాన్నంతా చెప్పే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది భగవద్గీత.
గీత అంటే భగవద్గీత ఒక్కటే అని అనుకోకూడదు. ఈ విశ్వానికంతటికీ మూలమైన సత్యం ఏమిటి, మనిషికీ, దైవానికీ సంబంధం ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, మనిషిస్వభావం, గమ్యం ఏమిటి మొదలైన ప్రశ్నలను విశ్లేషించి చెప్పిన పుస్తకాన్ని దేన్నైనా గీత అంటాం. భగవద్గీత ఒక ఉదాహరణ. అలాగే ఉద్ధవగీత, అనుగీత, అష్టావక్రగీత మొదలైన అనేక గీతలు మన సంప్రదాయంలో ఉన్నాయి. ఇవి అక్కడక్కడా భారత భాగవత గ్రంథాల్లో భాగాలుగానూ లేదా స్వతంత్ర గ్రంథాలుగానూ ఉన్నాయి. అయినా భగవద్గీత అన్నింటికన్నా ముఖ్యమైనదిగా వాడుకలో ఉంది.
భగవద్గీతను గూర్చి పండితులు ఇలా చమత్కరించారు – ‘ఉపనిషత్తులన్నింటినీ గోవులతో పోలిస్తే శ్రీకృష్ణుణ్ణి గోపాలుడుగా చెప్పవచ్చు. ఆ గోవుల పాలను పితికి అర్జునుడనే దూడకు కొంత అందజేయగా మనలాంటి శ్రోతలంతా గీత అనే అమృతాన్ని ఆస్వాదిస్తున్నాము’అన్నారు. దీన్నిబట్టి భారతీయ సంస్కృతికి అన్నింటికన్నా మూలమైనవి ఉపనిషత్తులనీ, వాటి సారం భగవద్గీత అని మనం తెలుసుకోవాలి.
భగవద్గీత గూర్చి మనకు చాల సందేహాలు ఉంటాయి. ఘంటసాల గారు పాడిన గీతను ఇటీవల మరణ సందర్భాల్లో వినిపించడం వల్ల ఈ పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అని కూడా కొందరి సందేహం. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. అనాదిగా మన పూర్వీకులు ఇండ్లలోనే పారాయణం చేసిన పుస్తకమిది.
ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు సైన్యాల్ని మోహరించి ఉండగా యుద్ధ సమయంలో ఇంత పెద్ద చర్చ జరిగిందా అని ఈనాటి విమర్శకుల సంశయం. నిజానికి భగవద్గీత కేవలం 30-40 పేజీల పుస్తకం. లక్ష శ్లోకాలున్న మహాభారతంలో కేవలం 700 శ్లోకాలు (అంటే 700 వాక్యాలు) ఉన్న భాగం. రెండు మూడు గంటల్లో చదివేయగల పుస్తకం. కృష్ణుడు, అర్జునుడు మాట్లాడుతున్నపుడు మిగతా యోధులు ఊరకే నిల్చి ఉండడంలో ఆశ్చర్యమేంలేదు. ఆ రోజుల్లో ధర్మయుద్ధాలు జరిగేవి. అంటే యుద్ధానికి రెండు వైపులా దుందుభులు మ్రోగించిన తర్వాత ఇరువైపులా ఉన్న పెద్దవారికి పిన్నవారు నమస్కారబాణాలు కాళ్ళముందు పడేటట్లు వేసుకోవడం, కుశల ప్రశ్నలు అడగడానికి కుడిచెవి ప్రక్కనుండి నమస్కార బాణాలు వదలడం, గురువు బాణాలు వేసిన తర్వాతనే శిష్యులు వేయడం ఇలా ఉండేది.
ఇటీవల ఒక విచిత్రమైన వాదన విన్నాం. భగవద్గీత హింసను ప్రోత్సహించే పుస్తకమంటూ రష్యా దేశంలో కోర్టులో వ్యాజ్యం వేశారు. మనమేధావులు కొద్దిమంది ఇలాంటి వాదనే చేస్తూంటారు. దీనికి కారణం గీతలో రెండు మూడు చోట్ల కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ ‘యుద్ధం చేయడం నీ ధర్మం’ అని చెప్పడం. సమాజంలో ప్రతి ఒక్కడికీ వాడివాడి ప్రవర్తనా నియమాలు ఉంటాయి. దాన్నే అతని ధర్మం అంటారు. సత్యం, అహింస, తపస్సు మొదలైనవి బ్రాహ్మణుని ధర్మాలైతే, సమాజంలో మంచిని స్థాపించడం, చెడును ఎదుర్కోవడం క్షత్రియుని ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడం అతని కర్తవ్యం. అంతేకాని యుద్ధం చేయమనీ, హింసను సాగించమనీ కృష్ణుడు చెప్పలేదు. బహుశా ఇలాంటి సందేహాలు ఎవరికైనా రావొచ్చనే భావనతో గీతపై వ్యాఖ్యలు వ్రాసినవాళ్ళు ‘ఇక్కడ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి ప్రోత్సహించడం లేదు, క్షత్రియధర్మాన్ని పాటించడానికి సిద్ధపడినవాడు అకస్మాత్తుగా వెనుదిరిగినపుడు ఆయన ధర్మాన్ని గుర్తుచేశాడు’ అంటూ వ్రాశారు.
యుద్ధసమయంలో ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ అంటూ పెద్ద పెద్ద విషయాలు ఎందుకు చర్చించబడ్డాయి అని మరొక సందేహం. భారతంలోని వ్యక్తుల్ని పరిశీలిస్తే ధర్మరాజు ధర్మాన్ని బాగా తెలిసినవాడు. కావున అతనికి సందేహాలు రాలేదు. భీముడు ఎమోషనల్ వ్యక్తి. ఎక్కువ ఆలోచించకుండా అన్న చెప్పింది చేసే స్వభావం. నకులుడు, సహదేవుడు అలాంటివాళ్ళే. అర్జునుడు అందరిలో గొప్ప యోధుడు, ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి. అందువల్ల అతని సందేహాల్ని తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అతనికి ధర్మం గురించి ఒక విశాలమైన అవగాహన (బిగ్ పిక్చర్) ఇస్తే తప్ప అతడు ముందుకు వెళ్ళడు. అందువల్ల అతను చేస్తున్న పని ధర్మమే అని చెప్పడం కృష్ణుడి వంతు అయింది. మామూలు సైనికుడైతే ఆదేశం ఇచ్చి పని చేయించవచ్చు. అతడే నాయకుడు కావడం వల్ల అతనికి వేదాంత స్థాయిలో వివరించాల్సివచ్చింది.
ఆ సమాజ పరిస్థితుల్లో కృష్ణుడు చెప్పిన విషయాలు మనకు వర్తిస్తాయా అని సందేహం రావచ్చు. వేదాల్లో (ఉపనిషత్తుల్లో) జీవుడు, పరమాత్మ, మనిషిధర్మం మొదలైన విషయాలపై చెప్పినవాటిని సనాతనధర్మం అంటారు. సనాతన అనే పదానికి అన్నికాలాలకూ వర్తించేది అని అర్థం. ఇది కేవలం విశ్వాసం పైన ఆధారపడింది కాక విశ్లేషణపైన ఆధారపడింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక మేధావులు దీన్ని ప్రశంసించారు.
మరి భాగవతం, రామాయణం, పురాణాలు మొదలైన మిగతా పుస్తకాలను ఏ కోవలో చేర్చాలి? మన సంప్రదాయం ప్రకారం ఉపనిషత్తులు, గీత లను primary texts అనీ, ఇతిహాసాలు, పురాణాల్ని secondary texts అనీ భావిస్తాం. ఉపనిషత్తుల్లో ఫిలాసఫీకి సంబంధించిన విషయాల్తో పాటు ధర్మానికి సంబంధించిన ఆదేశాలు ఉంటాయి. Secondary texts లో ఫిలాసఫీకన్నా ధర్మానికి ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకి ఉపనిషత్తులు బ్రహ్మచైతన్యమొకటే సత్యమనీ, మనం పూజించే దేవతాస్వరూపాలు ఆ చైతన్యంలో మనం భావించుకున్న రూపాలే అని చెపుతాయి. దీన్ని అనుసరించిన పురాణాలు వివిధరకాల దేవతాస్వరూపాల్ని వర్ణిస్తూ ఆనాడు మనదేశంలో ఉన్న అనేక సంప్రదాయాల్ని ఉపనిషత్తుల గొడుగు క్రిందికి తెచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్నిచోట్ల విష్ణుమూర్తి పూజ, కొన్నిచోట్ల శైవం, మరొకచోట శాక్తేయం ఇలా అనేక సంప్రదాయాలు ఉండగా వాటన్నింటినీ బ్రహ్మస్వరూపాలే అంటూ వివరించి అన్నింటికీ సామరస్యం సాధించాయి. అలాగే ఉపనిషత్తులు సత్యము, దానము అనేవాటిని టూకీగా చెబుతాయి. ఇతిహాసాలు, పురాణాలు వాటిని కథల రూపంలో విస్తారంగా వర్ణించి చెబుతాయి. హరిశ్చంద్రుడు సత్యాన్ని ఇలా పాటించాడు, శిబిచక్రవర్తి దానగుణాన్ని ఇలా పాటించాడు అంటూ ఉదాహరణలతో వివరిస్తాయి. నేటిభాషలో చెప్పాలంటే ఉపనిషత్తుల్ని Law texts తో పోలిస్తే ఇతిహాసాలు, పురాణాల్ని Case Law తో పోల్చవచ్చు. Case Law తెలియకుండా చట్టాన్ని ఎలా అర్థంచేసుకోలేమో అలాగే ఇతిహాస, పురాణకథల్ని చదవకుండా మనధర్మాన్ని సరిగా తెలుసుకోలేము అని అర్థం.
ఆధ్యాత్మిక చింతనలో ఫిలాసఫీకి ఎంత ప్రాముఖ్యముందో ధర్మాచరణకు అంతే ప్రాముఖ్యముంది. దీన్ని మనం క్రమక్రమంగా తెలుసుకుందాం.
This article was first published in Andhra Jyoti,a Telugu daily and has been republished with permission.
Disclaimer: The facts and opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.
The author is the former DGP of Andhra Pradesh and is a practitioner and teacher of Vedanta.