శ్రీదేవీ నవరాత్రులు పవిత్రమైన రోజులు అంటే మనిషి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, అనగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి కేటాయించిన సమయమని అర్థం. శరీరాన్ని అశ్రద్ధగా ఉంచితే ఎలా మాలిన్యం పెరుగుతుందో మనస్సును కూడా అశ్రద్ధగా ఉంచితే అలాంటి మాలిన్యమే పెరుగుతుంది. చక్కగా వ్యాయామం చేయడం వల్ల, స్నానం వల్ల శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో అలాగే తనను తాను పరీక్షించుకుని, మనస్సులో పేరుకున్న దురాశ, ద్వేషం లాంటి మలినాల్ని తొలగించుకోవడానికి మన పూర్వీకులు కల్పించిన సమయం దేవీనవరాత్రులు, వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు మొదలైనవి. ఈ రోజుల్లో కేవలం గుడికి వెళ్ళి కోరికలు కోరడం, ఆర్భాటంగా పూజలు చేయడం ఒక పద్ధతి. దానితోపాటు వ్యక్తిగతంగా ఉపవాసం లాంటి కొన్ని నియమాలను పాటించడంమరో పద్ధతి. ఈ పూజ యొక్క అసలు విషయాన్ని తెలుసుకోవడానికై శ్రద్ధగా ఒక పుస్తకాన్ని పారాయణం చేయడం సరియైన పద్ధతి. మన స్వభావాన్ని బట్టి మన పూజలు.
ప్రస్తుత దేవీనవరాత్రుల్లో సాధారణంగా పారాయణం చేసే పుస్తకాలు దేవీభాగవతం, దుర్గాసప్తశతి. పుస్తకం చదివితే మనస్సు ఎలా పవిత్రమౌతుంది?ఎలాంటి మంచి పుస్తకం చదివినా అది మన మనస్సుపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. దేవీభాగవతం అనేది మనకున్న ముఖ్య పురాణాల్లో ఒకటి. వేదాంతానికి చెందిన క్లిష్టమైన విషయాల్ని, మనిషి నడవడికకు, సమాజధర్మానికీ చెందిన అనేక విషయాలను సామాన్య పాఠకునికి అందించడం అందులో ముఖ్యవిషయం. కథ కేవలం ఒక సాకు మాత్రమే. Text is only a pretextఅంటారు ఆంగ్లంలో. ఎన్నో కథలు –హరిశ్చంద్రుని కథ, వశిష్ఠ, విశ్వామిత్రుల స్పర్ధ, రంతిదేవుని కథ, నారదుడు వ్యామోహంలో పడడం మొదలైన ఎన్నో కథలు ఈ పురాణంలో చూస్తాం. అట్లాగే దుర్గాదేవి అనేక రాక్షసుల్ని సంహరించడం చూస్తాం. కథాభాగాన్ని మాత్రమే చూస్తే మనకు, చిన్నపిల్లలకు తేడా ఉండదు. ఆయా పాత్రల మధ్య జరిగే సంభాషణ, ధర్మం గూర్చి, వేదాంత విషయాల గూర్చి చర్చ ముఖ్యంగా చదవాల్సిన విషయాలు. వీటిద్వారా రచయిత సింబాలిజం రూపంలో చెప్పదలుచుకున్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఈ పుస్తకం ఏడవ స్కంధంలో హిమవంతుడి కూతురుగా పుట్టబోతున్న శ్రీదేవి తనకు కాబోయే తండ్రికి చేసే వేదాంతబోధ మొత్తం వేదాంతశాస్త్ర సారంగా చెప్పవచ్చు. అలాగే శ్రీదేవి చూపించే విశ్వరూపమూ, భగవద్గీతలో కృష్ణుడి విశ్వరూపమూ ఒకటే. దీన్నంతా సంస్కృతంలోనే చదవాలనే నియమం లేదు. నాకు సంస్కృతం తెలిసినా మార్కెట్టులో లభ్యమయ్యే శ్రీసుబ్రహ్మణ్య సోమయాజి గారి అనువాదం చదువుతూంటాను.
దేవీభాగవతం పూర్తిగా దేవీతత్త్వాన్ని తెలిపే పెద్దపుస్తకం. ఇది కాక మనం మామూలుగా పారాయణం చేసే దుర్గాసప్తశతి మార్కండేయపురాణంలోని చిన్నభాగం. దుర్గాదేవి మహిషాసురుడిని, దంభుడు, శుంభుడు మొదలగు రాక్షసుల్ని చంపడం రెండు పుస్తకాల్లోనూ ఉన్న విషయం. దీనిలోని సింబాలిజం గూర్చి ప్రాచీనులు సంస్కృతంలో వ్రాసిన వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి. తెలుగులో సరైన పుస్తకాలు రాకపోవడం వల్ల ఇదంతా దేవతలు, రాక్షసుల యుద్ధాలు, మనిషికి సంబంధంలేని విషయాలుగా కనిపిస్తాయి.
దేవీభాగవతం ప్రకారం దేవియే శుద్ధజ్ఞానస్వరూపం, దేవియే శక్తి. ప్రపంచంలోని అన్ని శక్తిరూపాలూ ఈ పరమేశ్వరివే. మహాలక్ష్మి, సరస్వతి, దుర్గ, అలాగే అచ్చతెలుగులో చెప్పుకునే బతుకమ్మ, ఇవన్నీ ఆ శక్తి పేర్లే. ప్రకృతిలోని స్త్రీజాతి అంతా శక్తి అంశయే. అందుకే కుమారీపూజ అనే ఆచారం ఈ నవరాత్రుల్లో ఉంది. చిన్న బాలికల్ని దేవీస్వరూపంగా భావించి పూజచేయడం వల్ల వారిలో ఎంత ఉత్తమసంస్కారం, పవిత్రమైన భావనలు ఏర్పడతాయో ఊహించగలం. మిగతాదేశాల్లో కూడా దేవీపూజ ఒకప్పుడు ఉండేది. పురుషాధిక్య సంస్కృతి పెరిగిన తర్వాత స్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం ఆ దేశాల్లో ఆగిపోయింది.
పుస్తకాల పారాయణంతోపాటు నిష్ఠ ఉన్నవాళ్ళు ఉపవాసం కూడా చేస్తారు. ‘ఉప’ అంటే ‘దగ్గరగ’ అనీ, ‘వాసం’ అంటే ‘ఉండడం’ అనీ అర్థం. అంటే మనం పూజించే దేవతా తత్త్వానికి దగ్గరగా ఉండడం. మిగతా కార్యక్రమాల నుండి సాధ్యమైనంతగా మనస్సును మళ్ళించి శ్రద్ధతో పారాయణ చేయడం. ఉపాసన అన్నా కూడా ఇదే అర్థం. శ్రీదేవి ఉపాసన చేసే వాళ్ళు సప్తశతిని చదువుతూ కొన్ని మంత్రాల్ని జపం చేస్తారు.
శ్రీదేవి అనేది పురాణం పెట్టిన పేరు. వేదాంతం దీన్నే చైతన్యంలోని సృజన, లేదా మాయాశక్తి అంటుంది. ఈ శక్తిలో సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు ఉంటాయని ఇదివరలో చూశాం. సత్వం అంటే శాంతస్వభావం, సంతుష్టిగా ఉండడం, సత్యమార్గంలో ఉండడం మొదలైనది. రజస్సు విజృంభిస్తే ఇతరుల్ని డామినేట్ చేయాలనే భావం. దీనితోపాటు తమస్సు కూడా కలిస్తే హింసాత్మక ప్రవృత్తి కల్గుతుంది. ఇలాంటి ప్రవృత్తుల్ని అణచివేయడమే రాక్షసుల్ని చంపడం అంటే. ఇది మాయాశక్తిలో ఉన్న ఒక self correcting mechanismఅనవచ్చు. పై మూడు గుణాల సమతౌల్యం (balance)ఉండడమే ప్రకృతి స్వభావం.
నవరాత్రుల సందర్భంగా ఉన్న కథల్ని చూస్తే మహిషుడు అంటే మనలో ఉన్న దున్నపోతు స్వభావం, సోమరితనం, తామసగుణం లక్షణం. ఈ లక్షణాల్ని తీసివేయడమే మహిషాసురుణ్ణి వధించడమంటే. గీతలో దంభం, దర్పం మొదలైనవి తామస లక్షణాలుగా చెప్పారు. దంభమంటే నేనే గొప్ప ధార్మికుణ్ణిఅంటూ ఇంపోర్టెడ్ పువ్వులు, పండ్లు తెచ్చి పూజలు చేసి విర్రవీగి చాటింపు వేసే లక్షణం. అమ్మవారు దీన్నే దంభుడు అనే రాక్షసుడు అంటుంది. దీన్ని నశింపజేయడమే దంభుని వధ. అలాగే రక్తబీజుడు. వీని శరీరం నుండి క్రిందపడ్డ ఒక్కొక్క రక్తపుబొట్టూ ఒక్కొక్క రాక్షసుడిగా వస్తుంది అని వర్ణించినపుడు చెడు అనేది ఎంత త్వరగా పెరుగుతుంది అని చెప్పడమే. దాన్ని ఎప్పటికప్పుడు త్రుంచివేయాలన్నదే రక్తబీజుణ్ణి చంపడమంటే.
దేవతలకూ, రాక్షసులకూ తండ్రి ఒక్కడే. ఇద్దరూ శివుడినో, బ్రహ్మ దేవుణ్ణో పూజించి వరాలు పొందినవారు. ఈ వరాలతో విర్రవీగడం హింసాప్రవృత్తికి పాల్పడడం రాక్షస లక్షణం. ఈ రెండు గుణాలూ మనిషి మనస్సులో ఉన్నవే. అసుర గుణాల్ని తొలగించుకుని మనసును మంచి మార్గంలో పెట్టడమే వీటి ఉద్దేశం.
వేదాంతం చెప్పే నిర్గుణ తత్వం (formless concept)లో సగుణ రూపాల్ని (name and form) భావించి సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడమే పురాణాల ఉద్దేశం. వీటిలో వివిధ రకాలైన శాస్త్రాల గురించి ప్రాథమిక అవగాహన ఇచ్చే అంశాలుంటాయి. పెద్దబాలశిక్షలో లాగ కొన్నికథలు, కొంత వేదాంతం, కొంత ధర్మం, యోగము, ధ్యానపద్ధతులు మొదలైనవాటిపై స్థూలంగా ప్రస్తావన ఉంటుంది. సదాచారానికి చెందిన ఎన్నో విషయాలు ఈ పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ ఆచారాలలో కొన్నింటిని అతికొద్దిమందే పాటించడం చూస్తున్నాం. పాటించడానికి వీలైనన్ని పాటిస్తూ వ్యక్తి తనను తాను ఆధ్యాత్మికంగా బాగు చేసుకునే సమయమే ఈ నవరాత్రులు.
This article was first published in Andhra Jyoti, a Telugu daily and has been republished with permission.
Featured Image: India.com
Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.
The author is the former DGP of Andhra Pradesh and is a practitioner and teacher of Vedanta.