The article has been translated into Telugu by Ranjith Vadiyala
ప్రపంచంలో భారతదేశానికి తప్ప మిగిలిన అన్ని పెద్ద దేశాలకీ ఒక “మహా వృత్తాంతం” ఉంది. ఆ మహా వృత్తాంతమే ఆయా దేశ ప్రజలకి ఒక ఉమ్మడి గుర్తింపుని ఇస్తుంది. చాలా దేశాలు తమ మహా వృత్తాంతాన్ని గొప్పగా చూపించడం కోసం, తమ చరిత్రలో గొప్పగా ఉన్న కొన్ని సంఘటనలని ఎన్నుకొని, కొన్ని సందర్భాలలో లేని గొప్పతనాన్ని ఆపాదించి, చరిత్రని వక్రీకరించి, కొన్ని విషయాలను దాచి తయారు చేసుకున్నాయి. ఉదాహరణకి, అమెరికా విద్యార్ధులకి తమ దేశ నిర్మాతల (Founding Fathers of America) గురించి ఎంతో గొప్పగా చెప్తారు, కాని, వారిలో ఒకరైన థామస్ జెఫెర్సన్, జీవితాంతం బానిసలని కలిగి ఉన్న విషయాన్ని మాత్రం చెప్పరు. ఫ్రాన్స్, చైనా, రష్యా, జపాన్, బ్రిటన్ తదితర దేశాలన్నీ కూడా తమ తమ దేశాలని గొప్పగా చూపే మహా వృత్తాంతాన్ని కలిగి ఉన్నాయి. దానినే అక్కడ విద్యార్ధులకి నేర్పుతారు, అలానే మీడియా కూడా దానినే ప్రతిబింబిస్తుంది. దేశాలు మాత్రమే కాక అన్ని ‘అబ్రహాం సంబంద మతాలు’ (Abrahamic Religions: క్రైస్తవం, ఇస్లాం, యూదు మతాలు) కూడా మహా వృత్తాంతాలని కలిగి ఉన్నాయి. వాళ్ళ, వాళ్ళ పవిత్ర గ్రంధాలలో ఉన్న చారిత్రక ఘట్టం ఆధారంగా తమ మహా వృత్తాంతాన్ని తయారు చేసుకొన్నాయి.
ఒక దేశానికి చెందిన ప్రజలకి ఉమ్మడి గుర్తింపుని ఇవ్వటంలో, ఊమ్మడి ఆదర్శాలని నిర్ధారించడంలో, అలానే ముందు ముందు ఆ దేశం ఎటువంటి ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి అనేది నిర్ణయించడంలో ఆ దేశ మహా వృత్తాంతమే కీలక పాత్ర పోషిస్తుంది. అలానే ఒక దేశం తన గతాన్ని అర్దం చేసుకొని, దాని ఆధారంగా భవిష్యత్తుని నిర్దేశించుకోవటానికి ఒక మహా వృత్తాంతం చాలా అవసరం.
చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది భారతీయులకి, ముఖ్యంగా హిందువులకి, ఈ విషయంపై ఎటువంటి అవగాహనా లేదు. అంతే కాక వీళ్ళలో చాలా మంది ఇది మనకి అవసరంలేదనే, అసలు ఉండటానికి వీలు లేదనే అభిప్రాయంతో ఉన్నారు. భారతదేశ మహా వృత్తాంతానికి సంబంధించిన చర్చను లేవదీసినందుకు చాలా మంది నన్ను విమర్శిస్తున్నారు. ఈ చర్చ భారత సమాజ విభజనను ప్రోత్సహిస్తుందని వారి అభిప్రాయం. వాళ్ళ దృష్టిలో, ఒకదానితో మరోదానికి పొసగని, వేరు వేరు వృత్తాంతాలు కలిగిన, రకరకాల విభాగాల సమూహమే భారతదేశం. అంతే కాక ఇటువంటి ఒక దుస్తితిని మనం కలిగి ఉండటానికి కారణం హిందూ మతం, అని కూడా వీళ్ళు బలంగా నమ్ముతున్నారు.
‘హిందూ మహా వృత్తాంతం’, ఒక ‘తెరచి ఉండే నిర్మాణం’ (Open Architecture). హిందూ సమాజం ఎప్పుడూ కాలంతోపాటు మారుతూ, కొత్త ఆలోచనలకి, కొత్త సభ్యులకి స్థానాన్ని ఇస్తూనే ఉంది. హిందూ సమాజం ‘తెరిచి ఉండే నిర్మాణం’ అవ్వటం వల్లనే ఇది సాధ్యపడింది. ఆధ్యాత్మ విద్య ద్వారా, తమలోనే ఉన్న పరిశోధనశాలల్లో, ఋషులు కనిపెట్టిన విషయాల మీద ఇది ఆధారపడింది. భారతీయ ఆధ్యాత్మ విద్యని ఆధారం చేసుకొని పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం చాల ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. నాడీ శాస్త్రానికి సంభంధించి జరుగుతున్న ఇటువంటి పరిశోధనలు ప్రస్తుతం చక్కని ఫలితాలని చూపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఈ పరిశోధనలని, వాటిలోని భారతీయ మూలాలని తొలగించి, ఆ ఆవిష్కరణలని, వాళ్ళ సొంతం అని చెప్పుకొంటున్నారు. కొత్త కొత్త ఇంగ్లీష్ పేర్లు పెట్టి, వాటికి పేటెంట్స్ తీసుకొని వాళ్ళ సొంతం చేసుకొంటున్నారు. వ్యక్తిగత అభివృద్ది, వైద్య శాస్త్రం, యాజమాన్యం/నిర్వహణ వంటి రంగాలు మన శాస్త్రాల వల్ల ఇప్పటికే ఎంతో లాభపడుతున్నాయి. అందరికీ ఉపయోగపడే ఇటువంటి విషయాలని ఎన్నిటినో కలిగివున్న సంస్కృత భాషని రక్షించుకోవాల్సిన భాద్యత మనదే. ఇలా మన వాటిని పాశ్చాత్యులు తమవిగా చేసుకొంటున్న ప్రక్రియకి నేను ఉంచిన పేరు, ‘జీర్నీకరణ’ (Digestion).
వైజ్ఞానికమయిన (ఆధ్యాత్మిక/Inner Science) ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలని కలిగి ఉండే ‘హిందూ మహా వృత్తాంతం’ మిగిలిన వాటిలా మతపరమయినది మాత్రమే కాదు. నమ్మని వాళ్ళ మీద దౌర్జన్యాలు చెయ్యమని ప్రోత్సహించే దేవుడి వాఖ్యాలు “హిందూ మహా వృత్తాంతం” లో ఉండవు. మా మతం మాత్రమే నిజమైనది, మిగిలిన వాళ్ళందరూ మా మతంలోకి మారాల్సిందే అనే మూర్ఖ వాదాలు ఉండవు. ఇటువంటి మూర్ఖ వాదాలే గత 1000 సంవత్సరాలలో కొన్ని కోట్ల మంది చావుకి కారణమయ్యింది. మిగిలిన వాటిలా కాకుండా, వేరు వేరు వర్గాలకు చెందిన చిన్న చిన్న వృత్తాంతాలని తనలో ఇముడ్చుకొనే ‘తెరచి ఉండే నిర్మాణమే’ హిందూ మహా వృత్తాంతం.
మనం ఎన్నో మూర్తుల్ని, మరెన్నో పద్దతుల్లో ఆరాధిస్తాం. కాని ఈ తేడాల వల్ల ఎప్పుడూ హింస చలరేగలేదు. ‘ఇష్ట దేవతారాధన’ చేసుకోగలిగే వెసులుబాటు మనకి ఉండటమే దీనికి కారణం. ఉన్న ఆ ఒకే ఒక్క పరభ్రహ్మాన్ని నేను నా ఇష్ట దేవతలో చూసుకొని ఆరాధిస్తాను. అలానే వేరే వాళ్ళు, వాళ్ళ ఇష్ట దేవత ద్వారా అదే పర భ్రహ్మాన్ని ఆరాధిస్తే నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఏ మతం వాళ్ళయినా సరే. కాని ఇటువంటి ‘పరస్పర గౌరవం’ రెండు వైపుల నుండీ ఉండటం తప్పనిసరి. అవతలి వాళ్ళు కూడా, మన ఇష్ట దేవతని మనకు నచ్చిన పద్దతిలో ఆరధించుకొనే మన హక్కుని గౌరవించాలి. అంటే, మా మతం, మా గ్రంధం మాత్రమే గొప్పవి మిగిలినవన్నీ తప్పు, వాటిని నిర్మూలించాల్సిందే అనే మూర్ఖ వాదాలని ఆపి తీరాలి. అలా చెయ్యకపోతే వాటి వల్ల సమాజంలో ఉద్రిక్తత పెరిగి అది చివరికి హింసకు దారి తీస్తుంది/తీస్తోంది/తీసింది.
హిందూ మతం యొక్క ‘తెరచి ఉండే నిర్మాణం’ ఆధునిక ప్రపంచానికి హిందూ మతం అందిస్తున్న చాలా విలువైన కానుక. మన దేశంలో ఉన్న బహుత్వవాదానికి (ఎన్నో మతాలకి, కులాలాలకి, భాషలకి చెందిన ప్రజలు కలసి మెలసి ఉంటున్న స్థితి) ఇదే కారణం. ఈ విధానాన్ని అమలు చెయ్యటం ద్వారా మిగిలిన దేశాలు, వివిధ మతాల మధ్య, వివిద సిద్ధాంతాల మధ్య సామరస్యాన్ని సాధించవచ్చు.
క్రీస్టియానిటీ, ఇస్లాం మతాల మధ్య ఉన్న విభేదాలని, ఎవరో ఒకళ్ళు నష్టపోకుండా/ఓడిపోకుండా, పరిష్కరించుకోగలిగే అంతర్గత వనరులు రెండు మతాల వద్దా లేవు. ఒక ‘తెరచి ఉండే నిర్మాణం’ ద్వారా మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం, ఆ రెండు మతాల మధ్య సామరస్యం సాధ్యమవుతుంది. ఇది సాధించాలంటే ఆ రెండు మతాలూ కూడా, మా మతం మాత్రమే నిజమయినదనే వాదన మీదా, అలానే ఇతర మతస్తుల/విగ్రహారాధకుల పట్ల శత్రుత్వం మీద ఆధారపడని విధంగా తమ మత గ్రంధాలని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
హిందూ మాతానికి (బహుశా హిందూ మతానికి మాత్రమే) ఉన్న మరో గొప్ప లక్షణం, ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకోగలగటం; అలానే విమర్శలను సానుకూలంగా తీసుకోగలగటం. దీనికి కారణం మనకు స్మృతులను కాలానుగుణంగా మార్చుకొనే అవకాసం ఉండటమే (యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, మను స్మృతి వగైరా ఇలా వచ్చినవే). మన దేశంలో శాస్త్ర పరిశోధనలకి, మతానికి గొడవలు ఎప్పుడూ లేవు. గెలీలియో లాంటి శాస్త్రవేత్తలని బంధించడం, చంపివేయటం యూరోప్ లో జరిగింది కాని, మన దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. ఇతర మాతాలకు, జాతులకి చెందిన వాళ్ళని వేదించమని, బానిసలగా మార్చమని, చంపివేయమని హిందూ మతం ప్రోత్సహించదు. హిందువులు తమ ఆధ్యాత్మిక వనరులని ఉపయోగించుకొని ఎన్నో క్లిష్ట పరీస్తితుల నుండి బయటపడ్డారు, అలానే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు కనుగొన్నారు.
“మోక్షాన్ని పొందటం మాత్రమే హిందువు లక్ష్యం అవ్వటం వల్ల, బాహ్య ప్రపంచంతో సరి అయిన సంబంధం కలిగి ఉండడు”, అనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో ఉంది. అలానే సమాజం ఎదుర్కొనే సమస్యలని హిందువులు పట్టించుకోరని, మోక్షాన్ని పొందటమే లక్ష్యం అవ్వటం వాల్ల సమాజంలో ఉండే బీద వాళ్ళని, ముసలి వాళ్ళని అలానే వేరే సమస్యలతో బాధ పడే సాటి మనుష్యులని పట్టించుకోరనే తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ నిజానికి, వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని ఉద్దరించడానికి తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో గొప్ప వ్యక్తులు హిందూ మతంలో ఉన్నారు. అలానే వైద్యం, నిర్మాణ శాస్త్రం, నీటి పారుదల మొదలైన రంగాలో మన పూర్వీకులు సాధించిన ప్రగతి చూస్తే, మనం మోక్షానికి మాత్రమే కాదు లౌకిక ప్రగతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాం అనేది స్పష్టమవుతుంది. మోక్షం తో పాటు ధర్మ, అర్ధ, కామాలని కూడా కోరుకోమన్నారే కాని, కేవలం మోక్షం చాలు అని ఎవరు మనకి బోధించలేదు.
“హిందూ”, అనే పేరు కొత్తది కావచ్చు, కాని ఆ పేరు తో మనం దేనిని ప్రస్తుతం పిలుస్తున్నామో అది మాత్రం సనాతనమైనదీ మరియూ ఎన్నో వేల సంవత్సరాల అవిచ్చిన్న చరిత్రని కలిగి ఉన్నది. ఇతర మత విశ్వాసాలపై హిందూ మతం ప్రభావాన్ని వివరిస్తూ నేనొక పుస్తకాన్ని వ్రాస్తున్నాను. అయితే వాళ్ళు మన దగ్గర ఉన్న మంచిని గ్రహించి, వాళ్ళ మతానికనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసుకొని, వాళ్ళ మతంలో కలిపేసుకొని, అవి మావే అని చెప్పుకొంటున్నారు.
ధర్మ శాస్త్రాన్ని, అర్ధ శాస్త్రాన్ని, రాజ ధర్మాన్ని చాలా లోతుగా చర్చించిన మన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి శాస్త్రాల గురించి, మహాభారతం వంటి గ్రంధాల గురించి మన సమాజంలో చాలా ఎక్కువగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఐతే ఎక్కడా కూడా వీటిని భోదించక పోవటం వల్ల, మన శాస్త్రాలని ఎన్నిటినో మనం కోల్పోతున్నాం.
ఒక మహా వృత్తాంతం మనకు ఎందుకు అవసరం అనేది మనం ముందే చర్చించాము. ఐతే “హిందూ మహా వృత్తాంతం” ద్వారా మాత్రమే భారతదేశ ఐఖ్యత సాధ్యపడుతుందనేది మనం ఇక్కడ గమనించాలి. దీనికి విరుద్ధంగా మన దేశాన్ని కులాల, మతాల, భాషల, ప్రాంతాల వారిగా విడదీసి చూపించే వృత్తాంతాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. మన దేశంలో ఇటువంటి వేర్పాటు వాదాన్ని బలపరచి, ప్రచారం చేసే శక్తులకీ, విదేశాలలో ఉన్న కొన్ని సంస్థలతో ఉన్న ప్రమాదకరమైన సంబంధాలని, మన దేశాన్ని విడదీయటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని, నేను వ్రాసిన పుస్తకం “బ్రేకింగ్ ఇండియా” (Breaking India) లో చాలా లోతుగా, సాక్షాధారాలతో సహా చర్చించాను.
పాశ్చాత్యులు, ఇస్లాం అలానే చైనా తాము తయారు చేసుకొన్న శక్తివంతమైన “మహా వృత్తాంతం” ఆధారంగా ప్రపంచంఫై తమ పట్టుని పెంచుకోవడానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వీళ్ళందరి ప్రాధమిక లక్ష్యం భారతదేశమే. భారతీయులలో, తమ “మహా వృత్తాంతం” ఫలానా అనే విషయంఫై ఏకాభిప్రాయం లేకపోవటం దీనికి ముఖ్య కారణం. ప్రపంచ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న మన దేశం, తన మూల వృత్తాంతాన్ని అభివృద్ది చెయ్యటం కాని, దానిని ప్రజలతో చర్చించడం కాని పెద్దగా చెయ్యట్లేదు. నిజానికి మన దేశానికి చెందిన ఉన్నత వర్గం, ఈ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
చైనాతో సహా ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ తమ నాగరికత, చరిత్రకి సంబందించిన విషయాల పరిశోధనని తామే నియంత్రిస్తాయి. భారతదేశం మాత్రం, భారతదేశ (Indology) మరియు హిందూ మత అధ్యయనాన్ని దాదాపుగా బయట వాళ్లకు వదిలివేసింది. స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ వాళ్ళు, ప్రస్తుతం అమెరికా వాళ్ళు ఈ విదమైన అధ్యయనాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, మన దేశానికీ, మతానికి సంబంధించి జరిగే ఈ పరిశోధనలలో మన వాళ్ళు జూనియర్లుగా, అమెరకా సిద్ధాంతాలకి, ప్రణాళికలకి సరిపోయే సమాచారాన్ని అందించేవాళ్ళలా మిగిలిపోవడం. భారత నాగరికతకి సంబంధించిన ప్రతిష్టాత్మక జర్నల్స్ అలానే డిగ్రీలు (వివిధ విశ్వవిధ్యాలయాలు ఇచ్చే డిగ్రీలు) అన్నీ కూడా పాశ్చాత్యుల నియంత్రణలోనే ఉన్నాయి. లౌకికవాదం పేరు చెప్పి మన దేశ విద్యాలయాలలో హిందూ మతం గురిచి బోధించడం ఆపేశారు. ఇటువంటి పరిస్తితిని చక్కదిద్దాల్సిన మన విశ్వవిద్యాలయాలు మాత్రం, మానవ విజ్ఞాన శాస్త్రం (humanities) అలానే సామాజిక/సాంఘీక శాస్త్రానికి సంబంధించిన పాశ్చాత్య సిద్ధాంతాలని మన మీద రుద్ధడమే గొప్ప అనే బ్రమలో ఉన్నాయి. ఇవేవి కూడా మనదేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఉపయోగపడవు, సరికదా, మనల్ని మళ్ళీ మానసిక బానిసత్వంలోకి నేట్టివేస్తాయి. ఇటువంటి పరిస్తితి యొక్క ఫలితం – వేరే దేశస్తులని, ముఖ్యంగా పాశ్చాత్యులని మెప్పించడమే గొప్ప అని భావించే జాతి నిర్మాణం. ఇది మానసిక బానిసత్వ లక్షణం. ఈ పరిస్తితి ప్రస్తుతం మనకి భారతదేశం అంతటా కనిపిస్తోంది.
మన మేధావుల్లో దాదాపుగా అందరూ, పాశ్చాత్య సిద్ధాంతాలని ప్రచారం చేస్తున్న వారే. ఏకాంతంలో ఇటువంటి విషయాల గురించి మాట్లాడే చాలామంది బహిరంగంగా మాట్లాడారు. ఆత్మన్యూనత దీనికి ఒక కారణమయితే, ఇటువంటి విషయాలని గురించి మాట్లాడే వాళ్ళందరిని మన మీడియా మత వాదులని ముద్ర వేస్తుందనే భయం ఇంకో కారణం.
ఈ రోజు ఉన్న ఇటువంటి పరిస్తితికి కారణం, హిందువులకి సరైన నాయకత్వం లేకపోవటమే. హిందూ నాయకులు, మెధావులూ ‘పూర్వ పక్ష’ మనే సంప్రదాయాన్ని వదిలివేయడమే దీనికి కారణం. మన దృష్టి కోణంతో ఇతర మతాలని, సిద్ధాంతాలని, అభ్యసించడమే ‘పూర్వ పక్షం’. ఇస్లాం దండయాత్ర ముందు వరకూ కూడా ఇది మన సంప్రదాయంలో ప్రధాన బాగంగా ఉండేది. శంకరాచార్యులవారు చేసింది ఇదే, అనేది మనం మరువరాదు. తరువాతి రోజుల్లో వివేకానందుడు, గాంధీగారు, అరబిందో లాంటి కొద్ది మంది తప్ప ఈ పని ఎవ్వరూ చెయ్యలేదు. శంకరుల రోజుల్లో ఆయన బౌద్ధ, జైన తదితర మతాలని, సిద్ధాంతాలని అభ్యసించారు. ప్రస్తుత పరిస్తితులలో మన మేధోవర్గం ఇస్లాం, క్రీస్టియానిటి, కమ్మునిజం వంటి వాటికి మన దృష్టి కోణంతో అభ్యసించాలి. ప్రస్తుతం ప్రపంచంలో మేధో సంబంధమైన కురుక్షేత్రం జరుగుతోంది. వివిధ సిద్ధాంతాలూ, మతాలూ ఈ కురుక్షేత్రంలో పోటీ పడుతున్నాయి. దీనిలో విజయం సాధించాలి అంటే హిందూ నాయకులు ‘పూర్వ పక్షం’ ద్వారా ప్రపంచాన్ని ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న వివిధ మతాలనీ, సిద్ధాంతాలనీ చాలా లోతుగా మన దృష్టి కోణంతో అభ్యసించాలి. అప్పుడు మాత్రమే మనం ఆ సిద్ధాంతాలని, మతాలని విమర్శనాత్మక దృష్తితో చూడగలం, అలానే మన మీద వాళ్ళు చేస్తున్న విమర్శలకి సమాధానం చెప్పగలం. ఈరోజు ఎంతో మంది యువకులు సరైన మార్గనిర్దేశకుల కోసం చూస్తున్నారు, అటువంటి వాళ్ళు దొరక్క, ప్రస్తుత పరిస్తితులని ఎలా ఎదుర్కోవాలో తెలియక కలవర పడుతున్నారు. సరి అయిన నాయకత్వాన్ని, మార్గ నిర్దేశకత్వాన్ని అందిస్తే ఈ యువకులే మన దేశ భవిష్యత్తుని మార్చగలరు .
దేశంలోని అన్ని మాధ్యమాలలో ‘హిందూ మహా వృత్తాంతానికి’ సంబందించిన చర్చ పెద్ద ఎత్తున జరగాలి. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన, చాలా లోతైన అవగాహన అవసరమైన విషయం అవ్వటం వలన మన మేధో వర్గం దీనిని దూరదృష్టితో, అఖుంటిత దీక్షతో చేపట్టాలి.
Disclaimer: The facts and opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.